PMSBY-PMJJBY-complete-details

PMSBY-PMJJBY-complete-details

ఏడాదికి రూ. 456 ప్రీమియంతో రూ. 4 లక్షల బెనిఫిట్.. ఈ 2 ప్రభుత్వ పథకాల్లో చేరారా.. పూర్తి వివరాలివే..

PMSBY vs PMJJBY ముఖ్యాంశాలు
ఫీచర్లు / వివరాలు PMSBY (సురక్ష బీమా యోజన) PMJJBY (జీవన్ జ్యోతి బీమా యోజన)
బీమా రకం ప్రమాద బీమా (Accident Insurance) జీవిత బీమా (Life Insurance)
వయోపరిమితి 18 నుండి 70 సంవత్సరాలు 18 నుండి 50 సంవత్సరాలు
వార్షిక ప్రీమియం రూ. 20 (సంవత్సరానికి) రూ. 436 (సంవత్సరానికి)
మరణిస్తే వచ్చే బీమా రూ. 2 లక్షలు (ప్రమాదవశాత్తు చనిపోతే) రూ. 2 లక్షలు (ఏ కారణం చేతనైనా చనిపోతే)
వైకల్యం సంభవిస్తే రూ. 2 లక్షలు (పూర్తి వైకల్యం) / రూ. 1 లక్ష (పాక్షిక వైకల్యం) వర్తించదు (మరణానికి మాత్రమే లైఫ్ కవర్)

PMSBY Premium Amount: ప్రతి ఒక్కరికీ ఆర్థిక భద్రత అనేది ఎంతో ముఖ్యం. ఎంత సంపాదించినా భవిష్యత్తు కోసం కూడబెట్టాలి. ఇంకా బీమా మరింత ముఖ్యం. ఇందులో భాగంగానే ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు సామాజిక భద్రతా పథకాలు విజయవంతంగా 11 ఏళ్లు పూర్తి చేసుకున్నాయి. ఇక్కడ చాలా తక్కువ ప్రీమియం చెల్లించినా.. లక్షల్లో ప్రయోజనం కల్పిస్తున్నాయి. పూర్తి వివరాలు చూద్దాం.

Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana: దేశంలో ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత అనేది చాలా ముఖ్యం. మరీ ముఖ్యంగా ఇంట్లో సంపాదించే వ్యక్తిక ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినా లేదా అనారోగ్యం బారిన పడితే ఆ కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కూడా కష్టం. అందుకే బీమా అనేది అత్యంత ముఖ్యం. కానీ ప్రైవేట్ కంపెనీలు అందించే ఇన్సూరెన్స్ ప్రీమియంలు సామాన్యులకు భారంగా మారుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు కూడా అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు అద్భుతమైన బీమా పథకాల్ని అందిస్తోంది. అవే ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY), ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY). ఇక్కడ ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది.

మే చివర్లో ఆటో డెబిట్ అయ్యే సమయం దగ్గరపడుతున్న క్రమంలో.. చాలా మందికి బ్యాంకుల నుంచి మెసేజ్‌లు కూడా వెళ్తున్నాయి. ఖాతాలో తగినంత బ్యాలెన్స్ ఉంచుకోవాలి. లేకపోతే బీమా రద్దయ్యే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అసలు ఈ స్కీమ్స్ ఏంటి.. ప్రీమియం ఎంత చెల్లించాలి.. బెనిఫిట్స్ ఎలా ఉన్నాయి.. వంటి వివరాల్ని తెలుసుకుందాం.

ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY)

ఈ స్కీమ్ ఒక ప్యూర్ లైఫ్ ఇన్సూరెన్స్ (జీవిత బీమా) పాలసీ. ఇక్కడ పాలసీ దారుడు ఏ కారణం వల్ల అయినా మరణిస్తే.. అంటే అనారోగ్యం బారిన పడి లేదా ప్రమాదం వల్ల అయినా చనిపోతే వారి కుటుంబ సభ్యులకు అంటే నామినీకి రూ. 2 లక్షల బీమా మొత్తం అందుతుంది. అయితే ఇందులో ఎలాంటి మెచ్యూరిటీ బెనిఫిట్స్ ఉండవు. అంటే పాలసీ గడువు ముగిశాక డబ్బులు వెనక్కి రావు.

ఏడాదికి ప్రీమియం రూ. 436 మాత్రమే..

18 నుంచి 50 ఏళ్ల వయసు వారు ఇందులో చేరొచ్చు. అంటే పాలసీ గరిష్ఠంగా 55 ఏళ్ల వరకు అమల్లో ఉంటుంది. ఆలోపు పాలసీ హోల్డర్ మరణిస్తే బీమా అందుతుంది. ఏడాదికి ప్రీమియం రూ. 436 చెల్లించాల్సి ఉంటుంది. ఏటా జూన్ 1 నుంచి మే 31 వరకు పాలసీ చెల్లుబాటులో ఉంటుంది. మే 25-31 మధ్య ఏటా డబ్బులు ఆటోమేటిక్‌గా కట్ అవుతాయి.

పీఎంజేజేబీవై అర్హతలు..

ఈ స్కీంలో చేరాలంటే బ్యాంక్ లేదా పోస్టాఫీసులో సేవింగ్స్ అకౌంట్ ఉండాలి. ఒక వ్యక్తి.. ఒకే బ్యాంక్ అకౌంట్ ద్వారా మాత్రమే ఈ స్కీంలో చేరేందుకు అవకాశం ఉంటుంది. తొలిసారి చేరే సమయంలో జూన్- ఆగస్ట్ మధ్య చేరితే ప్రీమియం రూ. 436 గా ఉంది. సెప్టెంబర్- నవంబరులో అయితే రూ. 342, డిసెంబర్- ఫిబ్రవరిలో రూ. 228, మార్చి- మే లో చేరితే రూ. 114 ప్రీమియంగా ఉంది. రెండో ఏడాది నుంచి రూ. 436 చెల్లించాల్సి ఉంటుంది.

ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY)

ఈ స్కీమ్ విషయానికి వస్తే ఇది పూర్తిగా ప్రమాద బీమా పథకం. అంటే ప్రమాదాల వల్ల జరిగే నష్టాల నుంచి మాత్రమే రక్షణ కల్పించే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ అని చెప్పొచ్చు. ఇక్కడ ప్రమాదంలో మరణించినా లేదా శాశ్వత వైకల్యం బారిన పడినా ఆర్థిక సహాయం అందుతుంది. మరణం లేదా పూర్తి వైకల్యం అయితే రూ. 2 లక్షలు, పాక్షిక వైకల్యం బారిన పడితే రూ. 1 లక్ష అందుతుంది.

పీఎంఎస్‌బీవై స్కీమ్ అర్హతలు..

ఇక్కడ 18 నుంచి 70 ఏళ్ల వయసు వారు చేరొచ్చు. బ్యాంక్ లేదా పోస్టాఫీస్ అకౌంట్ ఇక్కడ కూడా కచ్చితంగా ఉండాలి. ఏడాదికి ఇక్కడ ప్రీమియం రూ. 20 చెల్లిస్తే సరిపోతుంది. అత్యంత చౌకైన ఇన్సూరెన్స్ అని చెప్పొచ్చు. ఇక్కడ కూడా పాలసీ కవరేజీ జూన్ 1 నుంచి మే 31 మధ్య ఉంటుంది. 70 ఏళ్లు దాటిన తర్వాత పాలసీ.. ఆటోమేటిక్‌గా రద్దవుతుంది.

రెండు పథకాల్లో ఒకేసారి చేరేందుకు అవకాశం ఉంటుందా?

బీమా కోసం ఈ రెండు పథకాల్లో ఒకేసారి చేరేందుకు అవకాశం ఉంటుంది. ఈ రెండింటికీ కలిపినా బీమా ప్రీమియం ఏడాదికి చాలా తక్కువగా ఉంది. సురక్ష బీమా యోజన ప్రీమియం రూ. 20; జీవన్ జ్యోతి బీమా యోజన ప్రీమియం రూ. 436 కలిపి ఏటా రూ. 456 ప్రీమియం చెల్లిస్తే గరిష్ఠంగా రూ. 4 లక్షల వరకు బీమా మొత్తం బెనిఫిట్ పొందొచ్చు.

చిన్న ఉద్యోగులకు ఈ స్కీమ్స్ వరం..

ఎక్కువగా చిన్న ఉద్యోగులు, రోజువారీ కూలీలు లేదా కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు, మధ్యతరగతి వారికి ఇలాంటి సామాజిక భద్రత పథకాలు ఒక అద్భుతమైన వరంగా చెప్పొచ్చు. చిన్న మొత్తాల్లో చెల్లించడం ద్వారా లక్షల్లో ప్రయోజనం అందుతుంది. సేవింగ్స్ అకౌంట్ ఉన్న బ్యాంకు లేదా పోస్టాఫీసుకు వెళ్లి నేరుగా ఈ పథకాల్లో చేరొచ్చు. మొబైల్ బ్యాంకింగ్ ద్వారా కూడా ఈ స్కీమ్స్‌లో చేరే వెసులుబాటు కల్పిస్తున్నాయి.

మీ స్థితిని తనిఖీ చేయడానికి దశలు

నెట్ బ్యాంకింగ్ / మొబైల్ యాప్ ద్వారా:

మీ బ్యాంక్ పోర్టల్ లేదా మొబైల్ యాప్‌లోకి లాగిన్ అవ్వండి.

సామాజిక భద్రతా పథకాలు (ఉదా, PMJJBY / PMSBY / APY)అని పేరున్న ట్యాబ్ కోసం వెతకండి .

మీ స్థితి యాక్టివ్, ఇనాక్టివ్ లేదా నమోదు కాలేదా అని చూడటానికి PMSBYని ఎంచుకోండి.

యాక్టివ్‌గా ఉంటే, మీరు మీ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్‌ను నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

మీకు ఏవైనా సమస్యలు ఎదురైతే లేదా వార్షిక ప్రీమియం డెబిట్ అయినప్పటికీ అనుసంధానించబడిన పాలసీ కనిపించకపోతే, మీ బ్యాంకు ప్రధాన శాఖను సంప్రదించండి లేదా 1800-180-1111 లేదా 1800-110-001జాతీయ టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయండి