heatwaves-complete-details-may-month
Heatwave Health Tips-Summer Safety Tips
చాలా మంది బయట నుంచి ఇంటికి వచ్చిన వెంటనే ఫ్రిజ్‌లోని ఐస్ చల్లటి నీరు తాగేస్తారు. చల్లటి నీరు తాగితే వెంటనే రిలీఫ్ వచ్చినట్టు అనిపించినా, ఇది ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతున్నారు.
వేసవి కాలంలో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడం చాలా ముఖ్యం. ఎక్కువ ఎండ, వేడి గాలులు, చెమట వల్ల శరీరంలో నీటి శాతం వేగంగా తగ్గిపోతుంది. అందుకే చాలా మంది బయట నుంచి ఇంటికి వచ్చిన వెంటనే ఫ్రిజ్‌లోని ఐస్ చల్లటి నీరు తాగేస్తారు. చల్లటి నీరు తాగితే వెంటనే రిలీఫ్ వచ్చినట్టు అనిపించినా, ఇది ఆరోగ్యానికి మంచిది కాదని జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) చెబుతుంది. ముఖ్యంగా ఎండలో ఎక్కువసేపు తిరిగి వచ్చిన వెంటనే చాలా చల్లటి నీరు తాగడం వల్ల శరీరంపై ఒక్కసారిగా ప్రభావం పడుతుంది.
శరీరం ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఐస్ నీరు తాగితే శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా మారిపోతుంది. దీనివల్ల జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి పడుతుంది. కొందరికి పొత్తికడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు రావచ్చు. అలాగే గొంతు మీద కూడా ప్రభావం చూపిస్తుంది. చాలా చల్లటి నీరు వల్ల గొంతు నొప్పి, దగ్గు, జలుబు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు శరీరం బలహీనంగా అనిపించడం లేదా తల తిరగడం కూడా జరుగుతుంది
ఎండలో నుంచి ఇంటికి వచ్చిన వెంటనే నీరు తాగకుండా కనీసం 10 నుంచి 15 నిమిషాలు విశ్రాంతి తీసుకోవడం మంచిది. ముందుగా శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితికి రావాలి. చెమట తగ్గి, శ్వాస సద్దుమణిగిన తర్వాతే నీరు తాగాలి. అప్పుడు కూడా ఒక్కసారిగా ఎక్కువ నీరు తాగకూడదు. చిన్న చిన్న ముద్దలుగా నెమ్మదిగా తాగడం మంచిది.
చాలా మంది ఫ్రిజ్ వాటర్ లేదా ఐస్ వాటర్ మాత్రమే వేసవిలో మంచిదని భావిస్తారు. కానీ గది ఉష్ణోగ్రతలో ఉన్న నీరు శరీరానికి ఇంకా మంచిదని చెబుతున్నారు. ఇది శరీరం సులభంగా గ్రహిస్తుంది. దాహం కూడా సాఫ్ట్‌గా తగ్గుతుంది. చాలా చల్లటి నీరు వల్ల శరీరంలోని రక్తనాళాలు ఒక్కసారిగా కుదించుకుపోయే అవకాశం కూడా ఉంటుంది.
వేసవిలో బయటకు వెళ్లేటప్పుడు తప్పకుండా నీటి బాటిల్ వెంట తీసుకెళ్లాలి. తరచూ కొద్దికొద్దిగా నీరు తాగుతూ ఉండాలి. కొబ్బరి నీరు, మజ్జిగ, నిమ్మరసం, తాజా పండ్ల రసాలు కూడా శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడతాయి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, బయట పనిచేసే వారు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. వీరికి డీహైడ్రేషన్ ప్రమాదం త్వరగా వస్తుంది.
ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎండలో నుంచి వచ్చాక వెంటనే ఫ్యాన్ లేదా AC ముందు కూర్చోవడం కూడా మంచిది కాదు. శరీరం క్రమంగా చల్లబడేలా చూడాలి. చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే వేసవిలో హీట్ స్ట్రోక్, డీహైడ్రేషన్, అలసట వంటి సమస్యల నుంచి సులభంగా రక్షించుకోవచ్చు. నీరు తాగడం ఎంత ముఖ్యమో, సరైన విధంగా తాగడం కూడా అంతే ముఖ్యం అని సూచిస్తున్నారు
